పద్యానికి పరవశించిన ప్రతిభా ప్రజ్ఞాశాలి శ్రీ విశ్వనాథ
పద్యానికి పరవశించిన
ప్రతిభా ప్రజ్ఞాశాలి శ్రీ విశ్వనాథ
డా.యస్.టి.జ్ఞానానందకవి
డా.యస్.టి.జ్ఞానానందకవి
అది వేసవి. సాయంకాల సంధ్యాసమయం. గుణదలకు వెళ్ళే మార్గంలో మొగల్రాజపురం దారిలో ఉన్న
తూము దగ్గర తమ ఇంటినుండి సహోపాధ్యాయులతో వస్తున్న కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి
దర్శనం లభించింది. పత్రికలలో ఆయన చాయా చిత్రాలను
చూచినవాడను. వారిని దర్శించడానికి బయలుదేరిన
నేను, ఆ మార్గమధ్యములోనే వారిని చూచుట లభించినది. అప్పటికే నేను ఆశువుగా గ్రంధాలు
వ్రాసాను. వారిని చూడగానే నా మేను పులకరించినది. కవితా సరస్వతి పలకరించి మేల్కొలిపినది. విశ్వనాధుని
గురునాధునిగా మనసులో తలచి ఆశువుగా కవిత చెప్పాను.
కలముంబూనుచు
వ్రాయనెంచెదవ గంగావాహినీ ధారలు
జ్జ్వలమై పాఱువిధాన
నీదు రచనా సామర్థ్య వైశద్య
ప్రోజ్జ్వల
ధారా సముదాయమట్టులె గదా పాఱున్ యదార్ధంబు ప
ల్కుల రాణిన్వలపించు
బ్రహ్మవు సుధోక్తుల్ నీ మహావాక్యముల్
సకలాంధ్రమ్ము నమస్కరింపగ మహాసాహిత్య లోకైక భూ
ష కవీశానులు, భూమినాధులు
త్వదీయంబైన మాధుర్య మం
జు కధా గీతుల
కందలింపగ యశఃస్ఫూర్తిన్ విడంబింప వి
శ్వ కవీంద్రా
మదహస్తి నెక్కితివి హర్షధ్వానముల్ మ్రోగగన్
కమనీయార్ద రసావతారధిషణా
గంభీరమూర్తీ దయా
సముదగ్రా వివిధార్ధ
కావ్య రచనా సామ్రాజ్య పట్టాభిషి
క్త మహాంధ్రాభ్యుదయాభిమాని
విలసద్బ్రాహ్మీస్వరూపా గుణో
త్తమ యౌదార్య
రసస్వభావ గురునాధా విశ్వనాధా నమః
నా ఆశు కవిత
పద్యాలకు ముగ్ధులైన కవిసామ్రాట్ గారు “నాయనా బాగున్నవి, ఇక
ఆపు, ఏమి కావలయును నీదేవూరు” అని తూము మీద కూర్చొని నన్ను అడిగినారు. నేను మా ఊరు, తాలూకా మొదలగు
వివరాలు పద్యాలతో జవాబిచ్చి నన్ను మీ శిష్యునిగా అంగీకరించవలసిందిగా వినయంతో విజ్ఞ్యప్తి
చేశాను.
“నాయనా నీవు
యధేచ్చగా నన్ను కలియవచ్చును. కృషి చెయ్యి, రాణింపు
వస్తుంది” అని దీవించారు. అది నా తొలి పరిచయం. నేను వ్రాసిన కావ్యగ్రంధాలన్నిటికీ శ్రీ విశ్వనాథ
వారే పీఠికలు అభిప్రాయాలూ వ్రాసారు. పీఠిక
వ్రాస్తూ “ ఇంకెవ్వరి వద్దను అభిప్రాయాలూ తీసుకొనవద్దు. నీకొక శైలి కలదు. నీ కవిత నీదిగా ఏర్పాటైపోయినది” అని దీవించారు.
నా “పాంచజన్యం”
కు గురువుగారు వ్రాసిన పీఠికను విజ్ఞాన వికాస విస్ఫురితులు, ఆచార్య
జి.వి.సుబ్రహ్మణ్యంగారు చదివి బహుధా ఆనందించారు.
ఇది అంతయూ నా అదృష్టం.
గురువుగారితో
కలిసి కొన్ని భువన విజయాలలో, కవి సమ్మేళనాలలో పాల్గొన్నాను.
చాలామంది అనుకున్నట్లుగా ఆయన కులద్వేషి కాడు. మానవతావాదం
కలవారే. మధుర హృదయులే. ధర్మమూర్తులే. దాక్షిణ్య
స్వభావులే. నా ఎరిగినంత వరకూ కొలదిమంది హరిజన
కవులు తమ గ్రంధాల పీఠిక నిమిత్తం శ్రీ విశ్వనాథ వారి వద్దకు రావడం, వారి అభిప్రాయాన్ని తీసుకోవడం, ఇది మాత్రమే గాక ఆ వచ్చిన
కవుల రాకపోకలకు, భోజనాలకు ఆయన ద్రవ్యం ఇవ్వడం నేనెరుగుదును. అంతటి ఔదార్యమూర్తి ఆయన.
జాషువాకవిగారు, విశ్వనాథ వారు విజయవాడ
రేడియోలో కావ్యగానానికి వచ్చారు. నేను గురువుగారితో
వెళ్ళాను. జాషువాతో విశ్వనాథ ఇలా అన్నారు “ జాషువా, జ్ఞానానందకవి
నా శిష్యుడని” అనగానే జాషువాగారు నవ్వుతూ “జ్ఞానానందకవి మావాడే” అని అన్నారు. నా సన్మానాలకు
ఎన్నింటికో గురువుగారు అధ్యక్షత వహించారు.
1950లో విజయవాడలో
మాన్యశ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు పంతులుగారికి రామ్మోహనరాయ్ గ్రంధాలయంలో “గాంధీ అమరగీతం”
అనే గ్రంధాన్ని అంకితమిచ్చాను. ఆ సందర్భంలో
గురువుగారు నాకు “కవికోకిల” బిరుదును ఇచ్చారు.
1974లో కళాప్రపూర్ణ బిరుదును ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు ఇచ్చినప్పుడు హనుమంతరావు
గ్రంధాలయంలో “అభినవ జాషువా” అనే బిరుదును గురువుగారు ప్రదానం చేశారు. ఆ సభలో శ్రీమతి హేమలతా లవణం, డా.ఇనాక్, మోదుకూరి జాన్సన్ ప్రభృతులు పాల్గొన్నారు. ఇవి విశ్వనాధ వారి యొక్క విశాల దృక్పధానికి, మానవతావాద సముద్ధరణ భావనకు ప్రతీకలు కావా?
నేను ఇంతటి
సాహిత్యాన్ని వ్రాయుటకు శ్రీ విశ్వనాథవారే స్ఫూర్తిప్రదాతలు. నా పట్లవారికున్న అమిత వాత్సల్యం వలన నా పెండ్లికి
పద్యాశీస్సులు పంపడమే కాక, నూటపదహారులు పంపించారు.
నా శిష్యుండును
సాధు కవియౌ జ్ఞానానంద మీ సాధువే
ళాశిష్టంబు
నదృష్టమందెడిని వాల్లభ్యంబు దీపింపగన్
ఆశీర్యోగ్యుడు
యోగ్యుడున్ నవశుభ ప్రారంభ సంపత్తికిన్
ఆశీస్సంతతి
నిత్తు నీ శుభవివాహ స్వచ్ఛవేళన్ బడిన్
గురునాధులవారి
ఆశీస్సులు అట్టివి. (విజయవాడ 12-5-1955)
నా కవితా జీవిత
పధానికి గురువుగారి ఆశీస్సులాలంబనలైన మూలకంబములు.
ఆయన దయకు పాత్రుడనైతిని. ఆయన ఆర్ద్రతా
హృదయములో నాకు చోటు లభించినది. ఇది నా సుకృత
భాగ్యం. ఎంతైనా చెప్పవచ్చు. అట్టి మహా జ్ఞానపీఠ పురస్కార గ్రహీతకు నా పాదాభివందనాలు.