జయంతి ప్రథమ సంచిక - విశ్వనాథ సంపాదకీయం



అధునా
ఇదివరకే తెలుగుదేశం నిండా పత్రికలు కోటానుకోట్లు వున్నవి.  ఇంకా కొత్తపత్రిక లెందుకయ్యా అనవచ్చు పెద్దలు. ఎవరి మట్టుకు వారికి పత్రిక పెట్టేందుకు తగినవి కాకపోయినా కారణాలు కనబడుతూనే వుంటవి.

ఈ కాలంలో పత్రికల సంపద, ఖండకావ్యాలూ, చిన్న కథలూ, నవలలూ, నాటకాలూ, విమర్శనలూ, అన్నీని. అగ్రస్థానం కథకీ, ఖండకావ్యానికీ, చిత్రాలకూ. కథలకేం ఖండకావ్యాలకేం పాశ్చాత్యుల వరవడి.  సరిగా అనుకరించడం ఉపజ్ఞ లేకుండా కుదరదు. ఇప్పటికి తెలుగులో బయలుదేరిన మంచికథలు వేళ్ళమీద లెఖ్ఖపెట్టవచ్చును.

ఖండకావ్యాల స్థితి కథలంత నాసిగా లేదు. ఖండకావ్యాలకి రూపం యేర్పడ్డది. ఏర్పడ్డది అంటానికి యింతమంది దుయ్యబట్టటమే సాక్ష్యం.  దీనివలన భావకవులు రసవంతంగా వ్రాసేవాళ్ళు, దేశంలో తగినంతమంది వున్నారనీ, ప్రతివాడూ ఒక్కొక్క వ్యక్తిత్వంతో  భాసిస్తున్నారు అనీ తేలుతోంది.

ఇంకా కారణాలు వున్నవి.  దేశంలో చదువుకున్నవాడూ అంటే ఇంగ్లీషు చదువుకొన్నవాడే.  అతనికి కీట్సు షెల్లీ, షేక్స్పియరుల పరిచయం వున్నంతగా పోతన్న పెద్దన్న తిక్కనల పరిచయం లేదు.  కానీ ప్రకృతం కవిత్వం ఆదరించాల్సింది అతను.

ఇక నేటి పండితులు.  వారికి తెలుగుమీదకన్న సంస్కృతం మీద గౌరవం.  ఏదన్నా క్రొత్త త్రోవ అంటే అట్లా పూర్వం వుండాలి.  అప్పుడది రైటూ.  కావ్యానికి మొదట మూడవకంటి మంట వుంటే అశ్లీలం.  పూర్వ కవి ఇల్లాగే వర్ణించాడు అంటే ఒప్పుకుంటారు.

స్వేచ్ఛ లౌకికజ్ఞానం చురుకుదనం సామాన్యంగా రాజభాషని ఆశ్రయించి వుంటవనీ, ఆ రాజభాష మన మాతృభాష కాకపోవడంవల్ల యిట్లా వుందనీ కొందరు.  ఇంగ్లీషు చదివినవారికి భాషాప్రయోగపద్ధతి తెలుసు.  పండితులకు పూర్వమార్గాలూ జాతిసత్వాలు తెలుసు.  ఇవి రెండూ భిన్నంగా నడిచినన్నాళ్ళూ ఇంతే అని కొందరు.

ఇంతకన్నా పెద్దకారణం పత్రికాధిపతులనీ, ఇతర దేశాల పత్రికాధిపతులు పండితులూ, రసజ్ఞులూ అనీ, రచనలన్నీ వాళ్ళ దగ్గరకి వస్తే మంచివి స్వీకరించి చెడ్డవి తిరస్కరిస్తూ, దేశంలో రసజ్ఞత్వం కలిగించి పాఠకులకు త్రోవచూపిస్తూ వుంటారనీ అంటారు.  మనదేశంలో పత్రికాధిపతులు ధనవంతులు.  పాశ్చాత్య భాషాసంపర్కం వల్ల భావౌదార్యం వారికి వుండవచ్చు.  కానీ దేశభాషతో తగినంత పరిచయం లేకపోవటం లోపం. దీనివల్ల రచయితలూ పత్రికాధిపతులూ పాఠకులూ అసమర్థులని కాదు, సమర్థుల సంఖ్య చాలాకొద్ది అనే.

మన పూర్వాధునిక కవులు ఇతరదేశ పూర్వాధునిక కవులతో తూగలేరని కొందరి వుద్దేశం.  కవిత్వం దేశ కాల పాత్రాలని అనుసరించి పుడుతుంది అంటారు.  షేక్స్పియరు తెలుగుదేశంలోనూ, తిక్కన్న ఇంగ్లాండులోనూ పుట్టడం ప్రకృతి ధర్మం కాదేమో!  ఎక్కడా కవులు కొద్దిమందే.  వారిలో శక్తీ వుంటుంది అది తెలుసుకుంటే కొత్త సృష్టీ వస్తుంది.  ఇది ఆంధ్రులకు కూడాను.

అసలు మనదేశం అస్వాత్రంత్యంలో వుందంటే మన భాష యీ స్థితిలో వుండటమే కారణం.  ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు ప్రధానభాష అయితే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తయారయిన విద్యార్థులు ఆంగ్లాభాషాభిమానులే అవుతారు.  కవిత్వం ఎప్పుడూ సంఘ మతాచారాలని రమ్యంగా హృదయాకర్షకంగా చెపుతుంది అంటారు.  ఆ కవిత్వం చదవటంతోటే ఆ సంఘ మతాచారాలందు అమిత యిష్టం పుడుతుంది.  ఇక నూతన ప్రియులు తన్మయులే.

మన మతంకన్నా ఏమాత్రం సంస్కారం వున్నా తక్కిన మతాలు సులభంగా అర్థమవుతై.  ఒకటి బాగా జీర్ణించుకొన్న తరువాత రెండోదాని మీదికి బుద్ధి చాలా ఆలోచనాపరుడికి కానీ పోదు.  షెల్లీని, షేక్స్పియరుని చదివింతరువాత ఛీ! మనవాళ్ళేమిటనిపిస్తుంది. వాళ్ళ దేశం అన్నా వాళ్ళ సంఘాచారాలన్నా అభిమానం కలుగుతుంది.  అట్లాగే తిక్కన్న పోతన్నలనే మొదట యెఱిగివుంటే ఆ అభిమానం ఇక్కడ ప్రవహిస్తుంది. 
 
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివిన విద్యార్థులందరూ షేక్స్పియరు షెల్లీలకు మల్లె తిక్కనాదులయందు గౌరవం కలవాళ్ళయి వీళ్ళ శిల్పం అట్లా తెలుసుకుంటే మరునిమిషం వీళ్ళకి స్వరాజ్యం కావద్దూ, మా తిక్కన యింతవాడని యితరదేశాల వాళ్ళకి చూపించవద్దా
కార్లైలని అడిగారాట ఎవరో? ఒకవేళ వదలిపెట్టాల్సివస్తే  హిందూదేశం వదిలిపెడతావా, షేక్స్పియరుని వొడదిలిపెడతావా అని.  హిందూ దేశమే వదిలేస్తానన్నాట్ట, అది సారస్వతం రుచి.  ఇదే ఇప్పటి ఆంధ్రుణ్ని అడిగితే తిక్కన్ననే.

భావం బ్రతుకుమీద ఆధారపడి వుంటోంది.  ప్రతి ఆంధ్రుడి బ్రతుకు ఇంగ్లీషు ఆక్రమిస్తే “ఆంధ్ర” భావం ఎక్కడ? ఆంధ్రుడికి మానసికశారీరాలు భిన్నంగా వున్నై.  ఇంతట అధమం భావాన్ని అయినా కాపాడితే మెఱుగని తోస్తుంది.

స్వాత్రత్ర్యమంటే యేమిటి? సంఘమతాచారాల్లో వ్యవస్థ వుండటం, వ్యక్తిత్వం చావకుండా చూసుకోటం.  ఈ సంఘ మతాచారాలకి ప్రధాన జయ స్తంభం సారస్వతం.  ఆ సారస్వతాన్ని ఎండగడితే చైతన్యం పోతుంది.

ఈ శారీరక మానసిక మార్గముల భిన్నత్వం ప్రతిబింబంలాగా మనం దినమూ పోయే నాటకాలు విస్పష్టంగా సూచిస్తున్నవి.  నాటకం హాలు నిండా విచిత్రమైన బొమ్మలు.  అవి గ్రీకు దేశపు స్త్రీల బొమ్మలు.  తెరలన్నీ ఆడే నాటకాలకు సంబంధించనివి.  ఆడే నాటకం తెలుగు నాటకం.  వెనక తెరా అదీ ఇంగ్లీషు హంగు.

నేత్రం వాంఛించేది వకటి. మనస్సు వాంఛించేది వకటి. దుష్యంతుడి ముందర ఇంగ్లీషు డాన్సు.  నలుడి వేషం నేటి ఒక మహారాజా ఖత్తు. ఈ నల్ల పెదవుల నలుడూ, యెఱ్ఱకళ్ళ నలుడేనా కలి నాశకుడిగా  కీర్తింపబడ్డ నలుడు? ఇందుకే సంప్రదాయం తెలియాలి అంటారు.

ఏ జగత్తుకైనా జీవితానికయ్యే భాషే పరిగ్రాహ్యం.  ఇక మనదేశం బాగుపడాలంటే తెనుగుభాషే జీవితానికయ్యే భాష కావాలి.   తక్కినవన్నీ తరవాత.
వి.స.
(జయంతి ప్రథమ సంచికలో విశ్వనాథ సత్యనారాయణ గారి సంపాదకీయం.  AP Press Academy Archives)
పై వ్యాసం పై మీకు కాపీరైటు హక్కు వుంటే దయజేసి తెలియజేయగలరు.  వెంటనే తొలగించబడుతుంది.  ఈ బ్లాగు లక్ష్యం మహాకవి, కవిసామ్రాట్ విశ్వనాథ వారిని స్మరించుకోవడమే

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

షష్టిపూర్తి మహోత్సవ దర్శనం

శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారిపై శ్రీ నోరి నరసింహశాస్త్రి గారి వ్యాసం